మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్‌కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. తన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి చూడాలని గవర్నర్‌ను చిరంజీవి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి మధ్య సినిమా గురించి ఆసక్తి కర చర్చ సాగినట్లు సమాచారం. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి తిరిగి సినిమాలో నటించటం..
ఫాలోయింగ్ చెక్కు చెదరకపోవటం పైన గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేసారని విశ్వసనీయ సమాచారం. అదే విధంగా సైరా సినిమా ప్రత్యేకతలను సైతం చిరంజీవి గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. గవర్నర్ సైతం చిరంజీవి సినీ లైఫ్ గురించి ఆసక్తిగా ప్రశ్నలు వేసారని సమాచారం. అదే విధంగా తాను చెన్నైలో ఉన్న సమయంలో నాటి విషయాలను..తమిళనాడుతో తనకు ఉన్న సంబంధాలను చిరంజీవి వివరించారు. తాను నటించిన తాజా చిత్రం చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాగా చిరంజీవి చెప్పుకొచ్చారు. సైరా నరసింహా రెడ్డి చూడాలంటూ మరో సారి చిరంజీవి ఆహ్వానించగా ..గవర్నర్ సైతం వెంటనే అంగీకరించారు. తప్పకుండా సినిమా చూస్తానంటూ బదులిచ్చారు. త్వరలోనే సినిమా చూస్తానని గవర్నర్ చెప్పారు.
కాగా, గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2న విడుదల అయిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఇప్పటికే హిట్ టాక్ తో సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుండి మంచి మంచి స్పందన రావడంతో మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సమాచారం.
