ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో లైన్ క్లియర్ అయింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బీఎస్ఎన్ఎల్‌ను గట్టెక్కించేలా సెంట్రల్ కేబినెట్ బుధవారం (23.10.2019) నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రంగ టెలికామ్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా బీఎస్ఎన్ఎల్ కొన్నాళ్లుగా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. అయితే చివరకు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ విలీనానికి ఆమోద ముద్ర వేసింది.
అంతేకాదు ఉద్యోగుల వీఆర్ఎస్‌కు సంబంధించి కూడా కేంద్ర మంత్రివర్గం అనూహ్యమైన నిర్ణయం వెల్లడించింది. ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ ప్యాకేజీ ప్రకటించడంతో పాటు 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయడం విశేషం. అయితే ఈ కేటాయింపులు 2016 ధరలకు అనుగుణంగా ఉంటాయని కేంద్ర టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అలాగే 4జీ స్పెక్ట్రమ్ ఆస్తులను మానిటైజ్ చేయడం ద్వారా దాదాపు 38 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండు సంస్థలకు చెందిన ఉద్యోగులకు వీఆర్ఎస్ వర్తిస్తుందని మంత్రి వివరించారు. 53 సంవత్సరాల పైబడి వయసున్న ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే గనక 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు 125 శాతం గ్రాట్యూటీతో పాటు నెల నెలా జీతం, పెన్షన్ అందిస్తామని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా దేశ ప్రయోజనాల కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి. ఈ రెండు సంస్థలను కూడా లాభాల్లో నడిపించే బాధ్యత ఉద్యోగులు తీసుకోవాలని.. దానికోసం తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.