వాషింగ్టన్: ఐసిస్ ప్రేరేపితుడైన ఓ పాకిస్థానీ న్యూయార్క్ నగరంలో ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే మరికొంత మందిని ఐసిస్ వైపు ఆకర్షించేందుకు పథకం రచించినట్లు తెలిసిందన్నారు. అవైస్ చుధారీ(19) అనే యువకుడు ఈ దుశ్చర్యకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అసిస్టెంట్ అటార్నీ జనరల్ జాన్ సీ డెమర్స్ ప్రకటించారు. అతడిపై కేసు నమోదు చేసి శుక్రవారం ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టారు. అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని న్యాయమూర్తులు ఆదేశించారు. దీనిపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు ఐసిస్‌కి చుధారీకి మధ్య ఫోన్ సంభాషణలు జరిగినట్లు ధ్రువీకరించారు.
న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేయడానికి ముందు చుధారీని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ), జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ అధికారులు విచారించినట్లు డెమర్స్ తెలిపారు. దాడికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారని, లక్ష్యాన్ని ఎంచుకొని రెక్కీ కూడా నిర్వహించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. జనంతో రద్దీగా ఉండే ప్రాంతాలు, పాదచారులే లక్ష్యంగా దాడికి కుట్రపన్నారన్నారు. అండర్‌కవర్ అధికారులు చేసిన ఆపరేషన్‌లో చుధారీ బాగోతం బయటపడినట్లు తెలిపారు. 2010లోనూ ఓ పాకిస్థానీ అమెరికన్ చేసిన కుట్రను అధికారులు భగ్నం చేశారు. టైమ్స్ స్వ్కేర్ ప్రాంతంలో కారులో అమర్చిన బాంబును పోలీసులు ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేశారు.