ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిలో ఆదివారం లాంచీ మునిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య రాయల వశిష్ఠ అనే ప్రైవేటు బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 12 మంది మృతి చెందారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతి స్వరూప్ తెలిపారు. 8 మంది మృతదేహాలు లభించాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) ప్రకటించింది.
మంగళవారం మరో 12 మృతదేహాలు లభించినట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 20కి పెరిగింది.
ఈ బోటు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ప్రయాణీకులు, బోటు సిబ్బందితో కలిపి మొత్తం 73 మంది ఉన్నారని రంపచోడవరం ఆర్డీఓ మీడియాకు తెలిపారు.
మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇంకా దాదాపు 27 మంది ఆచూకీ దొరకలేదు.
గల్లంతయిన వారి కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్, 6 అగ్నిమాపక, 2 నేవీ గజఈతగాళ్ళ బృందాలు, రెండు నేవీ హెలికాప్టర్లు, ఒక ఓఎన్జీసీ హెలికాపర్‌తో గాలిస్తున్నామని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. సైడ్ స్కాన్ సోనార్, ఇతర ఆధునాతన పరికరాలతో గాలింపు చర్యల్లో పాల్గొంటోంది.
