శ్రీకృష్ణుడు అనగానే ద్వాపరయుగం, మహాభారతం గుర్తుకు వస్తుంది. ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణం మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు.
కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుని పూజించడమే కాదు, అయనలోని కొన్ని మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్ధం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి.. మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి. శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనులలోను అర్థం పరమార్థం కనిపిస్తాయి. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కందపురాణం చెబుతుంది. ఈరోజు శ్రీకృష్ణాష్టమి కావడంతో దేశంలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
