ప్రపంచ వ్యాప్తంగా శాంతి, అహింస, సామరస్యాలను చాటి చెప్పిన జాతిపిత మహాత్మాగాంధీజీకి కర్ణాటకలోని మంగళూరు వద్దగల బ్రహ్మబైదార్కళ క్షేత్రంలో నిత్యపూజలు జరుగుతుండడం విశేషం. మంగళూరులోని గరోడి ప్రాంతంలోగల ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా పాలరాతితో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మూడుసార్లు హారతులతో జాతిపితకు పూజలు చేస్తున్నారు.
బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా శాంతి, అహింస, సామరస్యాలను చాటి చెప్పిన జాతిపిత మహాత్మాగాంధీజీకి కర్ణాటకలోని మంగళూరులో నిత్యపూజలు జరుగుతుండడం విశేషం. మంగళూరులోని గరోడి ప్రాంతంలోగల బ్రహ్మబైదార్కళ క్షేత్రం ఆలయంలో ప్రత్యేకంగా పాలరాతితో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ మూడుసార్లు హారతులతో జాతిపితకు పూజలు చేస్తున్నారు. గాంధీజీకి కర్ణాటకలో ఉన్న ప్రత్యేక ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. దేశానికి 1947లో స్వాతంత్య్రం లభించిన అనంతరం శాంతియుత విధానాలతో స్వాతంత్ర్యాన్ని సముపార్జించిపెట్టిన జాతిపితను మంగళూరు గారోడి ప్రాంత ప్రజలు స్వయానా దేవుడిరూపంగా భావించారు. 1948లో ఆలయాన్ని నిర్మించి చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అనంతరం 2006లో పాలరాతితో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గాంధీజీ పరమభక్తుడైన ప్రకాశ్ గారోడి వెల్లడించారు. ప్రతిరోజూ 3సార్లు ఈ దేవస్థానంలో పూజలు జరుగుతాయి. గాంధీజీకి ఇక్కడ వేడి కాఫీ, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా ఉంది. అనంతరం వీటినే ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు. ప్రతి పదిహేనురోజులకోసారి గ్రామస్తులంతా కలసికట్టుగా ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేస్తారు. స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై గాంధీజీ సూక్తులను గ్రామస్తులు కొన్ని దశాబ్దాలుగా గారోడి గ్రామంలో పాటిస్తుండడం విశేషమనే చెప్పుకోవాలి.
