ఈ రోజుల్లో చిన్నస్థాయి హోటల్‌కు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్లేట్ ఇడ్లీ.. తక్కువలో తక్కువ 20 రూపాయలు ఉంటుంది. కానీ ఈ 80 ఏళ్ల బామ్మ మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తున్నారు. 10 రూపాయలతో 10 ఇడ్లీలు తిని కడుపునింపుకోవచ్చు. ఈ బామ్మ నిస్వార్ధ సేవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇడ్లీ బామ్మను అభినందించకుండా ఉండలేకపోయారు.
కమలాతాళ్.. కోయంబత్తూరులో ఈ పేరు తెలియని వారుండరేమో. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున గుర్తు పట్టేస్తారు. ప్రేమతో తయారు చేసిన ఇడ్లీ, ఆప్యాయత కలిపిన చట్నీ, ఘుమఘుమలాడే సాంబార్.. ఇవే కమలాతాళ్ హోటల్ స్పెషల్. అందుకే కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్క చేయకుండా జనం కమలాతాళ్ హోటల్‌పై వాలిపోతారు.
తమిళనాడులోని పేరూర్‌కి సమీపంలోని వడివేలయంపాలయం గ్రామంలో కమలాతాళ్ నివసిస్తుంది. ఉదయం 6 గంటలకే ఆమె హోటల్ ప్రారంభమవుతుంది. అప్పటికే ఇడ్లీ కోసం చాలామంది బయట నిలబడి ఉంటారు. అవ్వ తలుపులు తెరవగానే, వారంతా ఆమెను నవ్వుతూ పలకరిస్తారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వేడి వేడి ఇడ్లీ అందిస్తుంది బామ్మ.
కమలాతాళ్ రోజూ వేకువజామునే నిద్ర లేస్తారు. శుభ్రంగా స్నానం చేసి, భగవంతుడిని మనసారా ప్రార్థించి, పొలానికి వెళ్లి తాజా కూరగాయలు తీసుకొస్తారు. కమలాతాళ్‌కు చిన్నతనం నుంచి రోట్లో రుబ్బిన పప్పుతోనే ఇడ్లీలు తయారుచేయడం అలవాటు. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. గ్రైండర్‌లో చేయడం ఆమెకు పెద్దగా నచ్చదు.
కమలాతాళ్ వయసు 8 పదులు. పండు ముదుసలి. కానీ ఆ వయసు శరీరానికే. మనస్సుకు కాదు. రైతు కుటుంబం కావడంతో తెల్లవారుజామునే లేవడం, ఉమ్మడి కుటుంబంలో పెరిగినందువల్ల ఎక్కువమందికి వంట చేయడం అలవాటైపోయింది. రాగి జావ తాగడం, సంతోషంగా ఉండడమే తన ఆరోగ్య రహస్యమని నవ్వుతూ చెబుతారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు ఇడ్లీలు అమ్ముతారు కమలాతాళ్. రోజుకి వెయ్యి ఇడ్లీలు అమ్ముతారు. సాంబారుతో పాటు, రోజుకో కొత్తరకం చట్నీ తయారుచేస్తారు. టేకు ఆకులు, అరటి ఆకుల్లో ఇడ్లీలు అందిస్తారు. వీటిని కూడా తన పొలం నుంచే తీసుకువస్తారు.
30 ఏళ్లుగా కమలాతాళ్ పని ఇదే. గతంలో ఒక ఇడ్లీ, బోండాను 50 పైసలకే ఇచ్చేవారు. రేట్లు పెరగడంతో ఆమె కూడా అర్థ రూపాయి పెంచారు. అసలు దీన్ని పెంచడం అనకూడదు. ఎవరైనా తిని డబ్బులు ఇవ్వకపోతే.. పోనీలే అని ఊరుకుంటారు. 10 రూపాయల ఇడ్లీలు తిని 5 రూపాయలే చేతిలో పెట్టినా పర్లేదులే డబ్బులు లేవేమో ఆకలితో ఉన్నాడేమో అని సరిపెట్టుకుంటారు. అంతేగానీ, డబ్బులిచ్చి కదులు అని గదమాయించరు.
చుట్టుపక్కల వ్యక్తులు, వారి మనస్తత్వాలు, ఆర్థిక పరిస్థితులు కమలాతాళ్‌కు బాగా తెలుసు. అందుకే పేద, మధ్య తరగతి ప్రజల కడుపు నింపడానికి ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు. తక్కువ ధరకు ఇడ్లీలు పెట్టడం వల్ల మధ్యతరగతి ప్రజలు నాలుగు రూపాయలు దాచుకుంటారని ఆమె అభిప్రాయం. ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపడమే తనకు పెద్ద ఆదాయమంటారు. చనిపోయేదాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతానని, ఎప్పటికీ ధర పెంచనని నిర్ణయించుకున్నారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు కమలాతాళ్ రూపాయి ఇడ్లీ కథ ఆనోటా ఈనోటా పాకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రాకు చేరింది. నిస్వార్థంగా సేవ చేస్తున్న కమలాతాళ్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. మనం జీవితంలో చేసే అన్నిపనులు కమలాతాళ్ చేస్తున్న సేవలో కొంత భాగానికైనా సరితూగుతాయా? అని విస్మయం వ్యక్తం చేశారు. ఐతే, కమలాతాళ్ కట్టెల పొయ్యిని వాడడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు ఎల్పీజీ స్టవ్, గ్యాస్ సిలిండర్ అందివ్వడానికి ముందుకొచ్చారు.
