శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న దాయాది పాకిస్థాన్ .. దుందుకుడు చర్యలు ప్రారంభించింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి మరీ ఎగదోస్తుంది. ఉగ్ర మూకలకు పాకిస్థాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తుందనే కఠోర సత్యం వెలుగుచూసింది. కశ్మీర్ లోయలో అశాంతి రాజేసేందుకు పాకిస్థాన్ కుటీల ప్రయత్నాలు చేస్తుందని దీనిని బట్టి అర్థమవుతుంది. కశ్మీర్ విభజన తర్వాత సరిహద్దులో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉన్నారు.
కశ్మీర్ విభజన తర్వాత గతనెల 22, 23 తేదీల్లో ఇద్దరు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారిస్తే నిజం అంగీకరించారు. కశ్మీర్ లోయలో అశాంతి నెలకొల్పేందుకు తాము చొరబడేందుకు ప్రయత్నించామని తెలిపారని వివరించారు. బుధవారం చినార్ కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్, జమ్ముకశ్మీర్ పోలీసు చీఫ్ మునిర్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీల్ అహ్మద్, మొజామ్ ఖొకర్ గతనెలలో బారాముల్లా సెక్టార్ నుంచి భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించారాని తెలిపారు. కశ్మీర్‌లో చిచ్చు రేపేందుకే వారు చొరబాటుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వీరే కాకుండా ఇతర ఉగ్రవాదులను కూడా కశ్మీర్ లోయలో అశాంతి నెలకొల్పేందుకు రాజేసారని ధిల్లాన్ పేర్కొన్నారు. వీరిద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అనుబంధ గ్రూపునకు చెందినవారని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కశ్మీర్‌లో శాంతికి విఘాతం కల్పించడమే వీరి పని అని తప్పుపట్టారు.
లష్కరే తోయిబా దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రమూకలకు పాకిస్థాన్ ఆర్మీ శిక్షణ ఇచ్చారని నిఘా వర్గాలు తెలిపాయి. దాదాపు 50 మంది వారికి ట్రైనింగ్ ఇచ్చారని ధ్రువీకరించాయి. శిక్షణ తీసుకొన్న తర్వాత జమ్ము కశ్మీర్‌లోని రెషియన్ గలి, కడ్లాన్ గలీలోకి చొరబడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మరోవైపు ముజఫరాబాద్‌లో మరో 80 నుంచి 90 మంది ఎస్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. వీరు హజిపూర్ నాలా వద్ద నుంచి చొరబడేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఓ వైపు చొరబాటుతోపాటు మరోవైపు జుర వ్యాలీ, జబ్బర్ వ్యాలీ వద్ద పాకిస్థాన్ భారీగా బంకర్లను మొహరించింది. చొరబాటును నిలువరించే క్రమంలో భారత్ దాడి చేస్తే .. ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉందని నిఘావర్గాలు తెలిపాయి.