వాషింగ్టన్: ప్రధాని మోదీతో సోమవారం సుదీర్ఘ మంతనాల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశంపై భారత్‌తో మితంగా మాట్లాడాలని ఇమ్రాన్‌కు ట్రంప్ సూచించినట్లు శ్వేత సౌధం వర్గాలు ప్రకటించాయి. వారం రోజుల వ్యవధిలో వీరివురి మధ్య సంభాషణలు సాగడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం ఇమ్రాన్ భారత ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీన్ని సోమవారం నరేంద్ర మోదీ ట్రంప్‌తో సాగిన ఫోన్ సంభాషణలో ఎండగట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రాంతీయంగా ఆందోళనలు రెచ్చగొట్టే అవకాశం ఉందని వివరించారు. భారత్ వాదనను అర్థం చేసుకున్న ట్రంప్ మోదీతో మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఇమ్రాన్‌కు హితబోధ చేసినట్లు అర్థమవుతోంది. అలాగే ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉభయ దేశాలూ సంయమనం పాటించాలని ట్రంప్ సూచించారు.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ఇమ్రాన్ ఖాన్ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా ఉన్న ఆయన ధోరణిని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద తీవ్రస్థాయిలో ఎండగట్టారు. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికి, ఉగ్ర విధ్వంసానికి తావులేని వాతావరణాన్ని ఏర్పర్చాల్సిన ఆవశ్యకతను కూడా ప్రస్తావించారు. ఈ మార్గాన్ని అనుసరించేవారితో కలసి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై భారత్ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు.
అలాగే ద్వైపాక్షిక వాణిజ్యంపై రెండు దేశాల మధ్య త్వరలోనే అత్యున్నతస్థాయిలో చర్చలు జరుగుతాయన్న ఆశాభావాన్ని ఇరు దేశాధినేతలు వ్యక్తంచేశారు. దాదాపు అరగంట పాటు ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
