ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలకఘట్టానికి మంగళవారం వేదిక కానుంది. ఆగష్టు 22న చేసిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్-2 ఉపగ్రహం మంగళవారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. శాటిలైట్‌లోని ద్రవ ఇంధనాన్ని మండిస్తే మరికొద్ది వేగాన్ని పుంజుకుని చంద్రుడి కక్ష్యలోకి వెళుతుందని వ్యూహం.
ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించిన కథనం ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుందని సమాచారం. బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ నుంచి శాటిలైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. ప్రయోగించిన నాటి నుంచి ఇప్పటివరకూ శాటిలైట్‌లోని అన్ని విభాగాలు బాగా పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది.
ఇస్రో చైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ.. మంగళవారం ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడమనేది అత్యంత కీలకమన్నారు. ఇది సవాల్‌తో కూడుకున్న విషయమని చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి చేరుకోనుండటంతో అధికారులు బెంగళూరులో సమావేశం కానున్నారు. అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం వీరికి వేదిక కానుంది. మంగళవారం జాతీయ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారు.