రాష్ట్రంలో వర్షాలు అడపాదడపా కురియనున్నాయని, కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం మినహాయిస్తే మిగతా అంతటా ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. రాయలసీమలో కనీసం 32 డిగ్రీలు ఉష్ణోగ్రతలు కొనసాగుతూ, అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో నైరుతిలో వర్షాలు సంతృప్తికరంగానే పడ్డాయని, పది శాతం మాత్రమే తగ్గుదల కనిపిస్తోందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాయలసీమలో 35 శాతం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ వరకూ రాష్ట్రమంతటా మామూలు వర్షాలే కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్త రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే 15 తర్వాత భారీ వర్షాలకు రాష్ట్రంలో అవకాశముంటుందని పేర్కొన్నారు.
