బెంగళూరు: రైళ్లలో ప్రయాణాలు సాగించేవారి కోసం రైల్వేశాఖ పలు సౌకర్యాలను కల్పిస్తుంటుంది. ఈ నేపధ్యంలో కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌లో ఒక పబ్లిక్ ఫ్రిజ్ ఏర్పాటు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని అవసరమైనవారు తీసుకోవచ్చు. ఈ ఫ్రిజ్‌లో నాలుగు అరలు ఉన్నాయి. వీటిలోని రెండు అరల్లో వండిన ఆహారం, మిగిలిన రెండింట్లో పండ్లు, కూరగాయలు ఉంటాయి. సాధారణంగా ప్రయాణికులు తమ వద్ద మిగిలిపోయిన ఆహారాన్ని పారవేస్తుంటారు. దీనిని నివారించేందుకే రైల్వేశాఖ రూ. 80 వేల ఖర్చుతో ఈ ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసింది. ప్రయాణికులు తమ వద్ద మిగిలిన ఆహారాన్ని ఈ ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. తద్వారా అవసరమైన వారికి ఆహారం అందుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. కాగా ఈ ఫ్రిజ్‌పై ఒక నోటీసు అంటించారు. మాంసాహారం, త్వరగా పాడయిపోయే ఆహారాన్ని దీనిలో పెట్టవద్దని ఆ నోటీసులో రాశారు. కాగా గడచిన మూడు రోజుల్లో ఈ ఫ్రిజ్‌ను వందమందికిపైగా వినియోగించుకున్నారు. దీనిని ఏర్పాటుచేసిన దక్షిణ-పశ్చిమ రైల్వే దీని నిర్వహణ బాధ్యతలను ఏదైనా స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని భావిస్తోంది.
WhatsApp us