డిసెంబర్‌లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కార్పొరేషన్ మేయర్ పదవులు, మునిసిపాలిటీ చైర్మన్ పదవులు, నగర పంచాయతీ అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిని ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2016లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సి వుండగా, వివిధ కారణాల వల్ల ఆ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ యేడాది డిసెంబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఓటర్ల జాబితా సవరణ పనులను రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టింది. ఇటీవల ఆ ఓటర్ల జాబితాలను కూడా విడుదల చేసింది. ఈ పరిస్థితుల్లో ఉన్నట్టుండి మేయర్, మునిసిపాలిటీ చేర్మన్ పదవులకు ప్రత్యక్షపద్ధతిన ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. ఈ విషయమై మాజీ మేయర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ మేయర్ పదవులకు ప్రత్యక్ష పద్ధతిన ఎంపిక చేయాలా లేక పరోక్ష పద్ధతిన ఎంపిక చేయాలా అని రాష్ట్ర ప్రభుత్వం అయోమయంలో కొట్టుమిట్టాడుతోందని ఆరోపించారు. ప్రతి ఆరుమాసాలకు ఒకసారి స్థానిక సంస్థల అధ్యక్ష పదవులకు పరోక్ష పద్ధతిన అంటే కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కలిసి అధ్యక్షులను ఎన్నుకుంటారని ప్రకటించడం, ఆ తర్వాత ఆ పదవులకు ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికల జరుపుతామని ప్రకటించడం ఆనవాయితీగా మారిందన్నారు. 1996లో చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో స్టాలిన్ ప్రత్యక్షపద్ధతిని మేయర్‌గా ఎన్నికయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో ఎం. సుబ్రమణ్యంను పరోక్షపద్ధతిలో మేయర్‌గా ఎన్నికయ్యారు. 2011లో మళ్ళీ ప్రత్యక్షపద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు సైదై దురైసామి మేయర్‌గా గెలిచారు. అటు పిమ్మట 2016లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మేయర్, మునిసిపల్ చేర్మన్ పదవులకు పరోక్షపద్ధతిన ఎన్నికలు జరిగేలా సవరణ చట్టాన్ని శాసనసభలో ఆమోదింపజేశారు. అయితే ఆ యేడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగలేదు. ప్రస్తుతం స్థానిక సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేయర్, మునిసిపల్ చేర్మన్ పదవులకు ప్రత్యక్షపద్ధతిని ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేయడం సంచలనం కలిగించింది.
చెన్నై మేయర్ పదవికి ఉదయనిధి?
ఇదిలా వుండగా చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోటీకి దింపడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై పరిధిలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో డీఎంకే గెలుచుకుంది. ఈ కారణంగానే చెన్నై మేయర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిన ఎన్నికలు జరిగితే చెన్నై ఓటర్లు డీఎంకే అభ్యర్థిని గెలిపిస్తారని ఆ పార్టీ నాయకులంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఉదయనిధి స్టాలిన్‌ను మేయర్ పదవికి పోటీ చేయించడానికి రంగం సిద్ధమైంది.
