రాజధాని అమరావతి నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ జీరో అవర్ నోటీసును ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడికి అందజేశారు. జీరో అవర్ లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించనున్నారు. అదే సమయంలో లోక్ సభలో గల్లా జయదేవ్ ఈ అంశాన్ని లేవనెత్తనున్నారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు దాదాపు స్తంభించిపోయాయి. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ వ్యవస్థలో చోటు చేసుకున్న అవినీతిని నిర్మూలించడంలో భాగంగా దాదాపు అన్ని రకాల ప్రభుత్వపరమైన నిర్మాణ పనులను నిలిపి వేసింది జగన్ సర్కార్. దీని ప్రభావం రాజధాని అమరావతి నిర్మాణం సహా పలు ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల రంగంపైనా తీవ్రంగా పడింది.
