ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల వివాదం ముదురుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి.
తాజాగా ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్న సూర్య రాఘవేంద్రను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి (వైస్ చాన్స్‌లర్) ప్రకటించారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరపాలని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
రాజమహేంద్రవరంలో ఉన్న ఆదికవి నన్నయ యూనివర్సిటీని పదేళ్ల క్రితం ప్రారంభించారు. నాటి నుంచి ఈ క్యాంపస్ చుట్టూ అనేక వివాదాలు అలముకున్నాయి. ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం కలకలం సృష్టించింది.
ఇంగ్లిష్ విభాగానికి అధిపతిగా ఉన్న సూర్య రాఘవేంద్ర అనే ప్రొఫెసర్ విద్యార్థినులకు అభ్యంతరకరమైన సందేశాలు పంపించడం, తన ఫ్లాట్‌కి రమ్మంటూ వారిని బలవంతం చేయడం వంటి ఆరోపణలు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాయి.
ముగ్గురు విద్యార్థినులు ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని కోరారు. వీసీగా ఉన్న సురేష్ వర్మ, ఇంగ్లీష్ ప్రొఫెసర్ మిత్రులు కావడంతో తమకు న్యాయం జరగడం లేదని వారు లేఖలో ఆరోపించారు.
యూనివర్సిటీ విద్యార్థులపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సీఎం విచారణకు ఆదేశించారు. దాంతో దసరా సెలవుల సమయంలో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జ్ వీసీగా ఉన్న సురేష్ వర్మ చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత కూడా క్యాంపస్‌లో జరుగుతున్న వ్యవహారాలపై ఇన్‌ఛార్జ్ వీసీ సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలూ వస్తున్నాయి. సెలవుల తర్వాత సోమవారం తిరిగి క్లాసులు ప్రారంభం కాగానే పలువురు మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ… “తల్లిదండ్రుల తర్వాత గురువులే విద్యార్థుల జీవితంలో కీలకం. అలాంటి వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి కూడా ఈ యూనివర్సిటీలో వ్యవహారాలపై దృష్టి పెట్టారు. అయినా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విధుల్లో కొనసాగిస్తుంటే విచారణ ఎలా సాధ్యం అవుతుంది. సస్ఫెండ్ చేయాల్సిందే. పూర్తిగా విచారణ చేసి బాధ్యులందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే” అని డిమాండ్ చేశారు.
ఆందోళనలు తీవ్రం కావడం, సెలవుల తర్వాత తొలిరోజే క్యాంపస్‌లో వేడి రాజుకోవడంతో చివరకు ప్రొఫెసర్‌ని సస్పెండ్ చేస్తున్నట్టు వీసీ సోమవారం సాయంత్రం ప్రకటించారు.