భారత దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ప్రథమ సంగ్రామంగా 1857 సిపాయిల తిరుగుబాటును అభివర్ణించిన ఘనత వినాయక్ దామోదర్ సావర్కర్‌దేనని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ వీర్ సావర్కర్ లేకపోతే, 1857 తిరుగుబాటు ఓ చరిత్ర అయ్యేది కాదన్నారు. దానిని మనం బ్రిటిషర్ల దృక్పథం నుంచి చూసి ఉండేవాళ్ళమన్నారు. 1857 తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా అభివర్ణించినవారు సావర్కర్ అని చెప్పారు.
పండిట్ మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని, స్వాతంత్ర్యానంతరం దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అమిత్ షా ప్రశంసించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేటపుడు ఆయన మనసులో ఏముందో కానీ, హిందూ సంస్కృతిని ప్రోత్సహించడంలోనూ, దానిని పరిరక్షించడంలోనూ ఘనంగా కృషి చేస్తోందని చెప్పారు.
గుప్త సామ్రాజ్యపు స్కందగుప్త విక్రమాదిత్యుని పరిపాలన మన దేశ రాజకీయ భవిష్యత్తుపై చూపగలిగే ప్రభావం గురించి చర్చించేందుకు ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సెమినార్ రెండు రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
సావర్కర్‌కు ‘భారత రత్న’ ఇచ్చేందుకు కృషి చేస్తామని మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల ప్రణాళికలో బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
![](https://indsamachar.com/wp-content/uploads/2020/04/logo-2.png)