దావణగెరె మహానగర పాలికెల తోపాటు 14 స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 6 నగరసభలు, 3 పురసభలు, 3 పట్టణ పంచాయతీల్లో 12న పోలింగ్ జరగనుంది. రామనగర్, దావణగెరె, కోలారు, చిక్కబళ్ళాపుర, శివమొగ్గ, చిక్కమగళూరు, దక్షిణకన్నడ, ధార్వాడ, బళ్ళారి నగర పాలికెలకు ఎన్నికలు జరుగనున్నాయి. చామరాజనగర్, ఉడిపి, గదగ్, కొప్పళ తాలూకా పంచాయతీలతోపాటు ఖాళీ అయిన 213 గ్రామ పంచాయతీల వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు చామరాజనగర్ జిల్లా పంచాయతీకి ఎన్నికలు కొనసాగనున్నాయి. ఆదివారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టయ్యింది. ఈనెల 31వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా ఉపసంహరణకు 4వ తేదీ చివరి రోజు. నవంబరు 12న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలదాకా పోలింగ్ సాగనుండగా నవంబరు 14న కౌంటింగ్ జరుగనుంది. కాగా మహానగర పాలికెలలో పోటీ చేసేవారికి రూ.3లక్షలు, నగరసభకు రూ.2లక్షలు, పురసభకు రూ.1.30లక్షలు, పట్టణ పంచాయతీకి రూ.1లక్ష వరకు అభ్యర్థులు ఖర్చు చేసుకునే వెసలుబాటు ఉంది.