హైదరాబాద్ : తెలంగాణ కొత్త గవర్నర్ కొలువు దీరారు. రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అనుకున్న సమయానికి ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, విపక్ష నేతలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితర నేతలు హాజరయ్యారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా హాజరయ్యారు.
అంతకుముందు హైదరాబాద్‌కు చేరుకున్న కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఘన స్వాగతం లభించింది. పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, బీజేపీ నేతలతో పాటు తదితరులు స్వాగతం పలికారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణ కొత్త గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తమిళిసై సౌందరరాజన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం తెలంగాణకు చెందిన నేతలను పరిచయం చేసుకున్నారు కొత్త గవర్నర్. అదలావుంటే రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా వచ్చిన తమిళిసై సౌందరరాజన్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమిళిసై సౌందరరాజన్.. తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.
