శ్రీనగర్: జమ్ము కశ్మీర్ యువత సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. తాజాగా వందల మంది స్థానిక యువకులు తమ శిక్షణను విజయవంతంగా ముగించి ఆర్మీలో చేరారు. జమ్ము కశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ (జేకేఎల్‌ఐ) బెటాలియన్‌లో పని చేసేందుకు వీరిని నియమించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటు రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. మొత్తం 575 మంది డిగ్రీ పూర్తి చేసిన యువకులు ఆర్మీలో చేరిన సందర్భంగా శనివారం తల్లిదండ్రులతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ ఉన్నతాధికారులు సహా యువకుల బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బానా సింగ్ పరేడ్ మైదానంలో కవాతు నిర్వహించారు.
డిగ్రీ పూర్తి చేసిన ఈ యువకులను సైనికులుగా తీర్చిదిద్దే శిక్షణ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ అశ్వనీ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. దేశానికి సేవ చేయాలనే తపన ఈ యువకుల్లో నిండి ఉందని, స్వాగత కార్యక్రమంలో వీరి తల్లిదండ్రుల్లోనూ ఈ భావన కనిపించిందని అశ్వనీ కుమార్ ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు. ఈ రెజిమెంట్‌లో ఎక్కువగా స్థానికులే ఉన్నందున దీనికి కశ్మీర్‌తో దగ్గరి సంబంధం ఉందని చెప్పారు. తమ కుమారుడు ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉందని కొందరు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
WhatsApp us