న్యూఢిల్లీ, అక్టోబర్5 (జనంసాక్షి): భారత్ – బంగ్లా దేశాల సంబంధాలు ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇరువురు దేశాధినేతల సమక్షంలో ఇరు దేశాలు ఒప్పంద పత్రాలు మార్చుకున్నాయి. రెండు దేశాల మధ్య రక్షణ మరియు భద్రత, వాణిజ్యం మరియు కనెక్టివిటీతో సహా విభిన్న రంగాలలో సంబంధాలను బలోపేతం చేయడానికి మూడు ప్రాజెక్టులను మోడీ,హసీనా సంయుక్తంగా ప్రారంభించారు. ప్రధాన ప్రాంతాలలో
రవాణా, కనెక్టివిటీ, సామర్థ్యం పెంపు, సంస్కృతి వంటి 7 ఒప్పందాలు ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి.
సమావేశంలో బంగ్లాదేశ్ నుంచి ఎల్‌పిజి దిగుమతి చేసుకున్న మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో 3 ద్వైపాక్షిక ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవకాశం లభించినందుకు తాను సంతోషిస్తున్నానని మోడీ అన్నారు. ఒక సంవత్సరంలో మొత్తం 12 ఉమ్మడి ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. భారత్, బంగ్లాదేశ్ భాగ్యస్వామ్యానికి ఆధారం రెండు దేశాల్లోని ఒక్క పౌరుడు అభివృద్ధి చెందడమేనని అన్నారు. బంగ్లాదేశ్‌తో భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. భారత్, బంగ్లా సంబంధాలు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. మోడీతో సమావేశానికి ముందు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో షేక్ హసీనా భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.