న్యూఢిల్లీ: నెరిసిన గుబురు గెడ్డం, నెత్తిన గుజరాతీ సంప్రదాయద్ధమైన తలపాగా ధరించి, నడవ లేని స్థితిలో దేశ రాజధానిలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీల్ చైర్ లో వచ్చిన ఆ వయోధిక వృద్ధుడి పేరు అమ్రిక్ సింగ్. వయస్సు 81 సంవత్సరాలు. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ బయలుదేరి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని ఎక్కబోతూ చివరి నిమిషంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల చేతికి చిక్కాడు. పాస్ పోర్ట్ లో కనిపించిన ఓ చిన్న తప్పు కారణంగా అతని బండారం బట్టబయలైంది. అసలుకే ఎసరు తెచ్చి పెట్టింది. నిజానికి- ఆ వృద్ధుడు.. వృద్ధుడు కాదు. 32 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి. అతని అసలు పేరు జయేష్ పటేల్. గుజరాత్ లోని అహ్మదాబాద్ అతని స్వస్థలం.
మారు వేషం వేసుకుని నకిలీ పాస్ పోర్ట్ ను పొందిన జయేష్ పటేల్.. న్యూయార్క్ వెళ్లబోయి సీఐఎస్ఎఫ్ బలగాల చేతికి చిక్కాడు. కటకటాల వెనక్కి వెళ్లాడు. వీల్ చైర్ లో విమానాశ్రయానికి వచ్చిన అతణ్ని మొదట సీఐఎస్ఎఫ్ బలగాలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా వయోధిక వృద్ధుడనే ఉద్దేశంతో అతణ్ని విమానాశ్రయం కారిడార్ లోనికి ప్రవేశించడానికి సహకరించారు కూడా. అమ్రిక్ సింగ్ కు సహాయం చేసే సమయంలో.. అతని ప్రవర్తన, ముడతలు పడని చర్మం భద్రతా బలగాల్లో అనుమానాాలను రేకెత్తించింది.
పాస్ పోర్ట్ ను నిశితంగా పరిశీలించగా.. వయస్సును దిద్దినట్టు కనిపించింది. దీనితో పోలీసులు అమ్రిక్ సింగ్ ను అదుపులోకి తీసుకోగా.. అసలు విషయం బహిర్గతమైంది. వెంటనే అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
WhatsApp us