చెన్నై: భారత్-చైనా సత్సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కోవలం వేదికగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ రెండో రోజు ఇష్టాగోష్ఠి జరిపారు. అనంతరం ప్రతినిధుల బృందం స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మోదీ, జిన్‌పింగ్ తమ భేటీపై అభిప్రాయాలను అధికారులతో పంచుకున్నారు.
విభేదాలు పెరగకుండా చూసుకుంటాం: మోదీ
”చెన్నై కనెక్ట్’ భేటీతో భారత్-చైనా బంధంలో కొత్త అధ్యాయం మొదలైంది. వూహాన్‌లో జరిగిన తొలి భేటీనే ఇందుకు స్ఫూర్తి. చైనా, తమిళనాడు మధ్య బలమైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఆర్థికంగా మన రెండు దేశాలు శక్తిమంతమైనవి. ఇరు దేశాల మధ్య విభేదాలు పెరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. మన సంబంధాలు, సమస్యలపై సున్నితంగా ఉందాం. ప్రపంచంలో శాంతి, స్థిరత్వం కోసం మనవంతు సహకారం అందిద్దాం’ అని మోదీ చెప్పుకొచ్చారు.
మీ ఆతిథ్యంతో మైమరచిపోయాం: జిన్‌పింగ్
‘ఈ పర్యటన నేను ఎప్పటికీ మరువలేను. మీ ఆతిథ్యం మమ్మల్ని మైమరచిపోయేలా చేసింది. నాకు, నా సిబ్బందికి ఈ పర్యటన ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. మోదీజీ మీరన్నట్లుగానే మన మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయి’ అని జిన్‌పింగ్ కొనియాడారు.
ఈ చర్చల అనంతం కోవలం రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్తువులు, కళాఖండాల ప్రదర్శనను మోదీ, జిన్‌పింగ్ సందర్శించారు. విందు భేటీలో మరోసారి చర్చలు జరిపిన అనంతరం జిన్‌పింగ్ తిరుగు పయనమవనున్నారు.