న్యూఢిల్లీ: ఆరోగ్య భారత్ కోసం అందరూ ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఫిట్‌నెస్ ప్రతిఒక్కరి జీవన విధానం కావాలి అని అన్నారు. క్రీడల్లో రాణించాలంటే శారీరక ధృడత్వం చాలా అవసరమని అన్నారు. దీంతో ఎటువంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. హాకీ స్టిక్‌తో ఆ క్రీడలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మేజర్ ధ్యాన్‌చంద్ మనదేశంలో పుట్టారని, ఆయనకు ధన్యవాదాలు అని అన్నారు. సాంకేతికంగా అభివృద్ధి సాధించటం వల్ల మనం కొద్దిదూరం కూడా నడవలేకపోతున్నామని, కనీసం రోజుకు రెండువేల అడుగులు కూడా వేయలేకపోతున్నామని అన్నారు.
