పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ. 2 వేల నోటు, రూ. 500 నోటు ఇక ముందు కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల వాడకాన్ని తగ్గిస్తూ..తిరిగి వాటిని ఆర్బీఐ వెనక్కి తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఇక ముందు రూ. 2 వేల నోట్లు రాకుండా చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఏటీఎంలలో 2 వేల నోట్ల కట్టలను ఉంచే అరలను తొలగిస్తున్నారు. త్వరలో రూ. 500 నోట్ల అరలు కూడా తీసేస్తారని సమాచారం. భవిష్యత్‌లో మిగతా బ్యాంకులు కూడా ఇదే దారిలో వెళ్లే అవకాశముంది. ఇప్పటికే చాలా ఏటీఎంల నుంచి రూ. 2 వేల నోట్లు రావడం లేదు.
రూ. 100,రూ. 200 భారీ మొత్తంలో చలామణిలో ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న నోట్ల కారణంగా ఏటీఎంలలో ఉంచే నగదు పరిమితి తగ్గే అవకాశం ఉండడంతో విత్ డ్రాలను పెంచేందుకు సిద్ధమయ్యారు. మెట్రో నగరాల్లో 10 సార్లు, ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
