రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు చేసే హక్కు తమ దేశానికి ఉందని, ఏది కొనుగోలు చేయాలో ఏది వద్దో చెప్పే అధికారం ఇతర దేశాలకు లేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన వాషింగ్టన్ వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో భేటీ కావడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్ల విషయంలో అమెరికా అభ్యంతరాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రష్యా నుంచి అత్యాధునిక గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను కొనుగోలు చేసేందుకు భారత్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అమెరికా సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై జైశంకర్ స్పందిస్తూ, ఆయుధాలు సమకూర్చుకోవడం, కొనుగోళ్లు అనేవి పూర్తిగా దేశ సౌర్వభౌమాధికారమని అన్నారు. ఈ విషయాన్ని తాము తరచు స్పష్టం చేస్తూనే ఉన్నామని తెలిపారు. అయితే అమెరికా అభ్యంతరాలపై చర్చిస్తామని చెప్పారు. ‘సార్వభౌమాధికార దేశంగా మా ఇష్టాఇష్టాలు మాకుంటాయి. ఆ విషయం అంతా గుర్తించాలి’ అని అన్నారు.
కాగా, 2017 చట్టం ప్రకారం… రష్యా నుంచి భారీ ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంటుంది. ఉక్రెయిన్, సిరియాలో రష్యా సైనిక జోక్యం చేసుకుంటోందని, అమెరికా ఎన్నికల్లోనూ రష్యా జోక్యం ఉందని అమెరికా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో 2017 చట్టం తీసుకువచ్చింది.
