బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన ఆర్బిటర్ ద్వారా దాని జాడ తెలిసింది. విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన హైరిజల్యూషన్, హైబీమ్ థర్మల్ కెమెరా కొన్ని ఫొటోలు తీసింది. ఆ ఫొటోలే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ జాడను తెలిసేలా చేశాయి. థర్మల్ కెమెరా ఫొటోలను క్లిక్ మనిపించగానే.. ఆ సందేశం క్షణాల వ్యవధిలో గ్రౌండ్ స్టేషన్ కు చేరిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో ల్యాండర్.. చంద్రుడి ఉపరితలం మీద దిగిందని నిర్ధారించారు. తాము ఆశించిన విధంగా సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా.. హార్డ్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు.
దాని పనితీరు గానీ, అందులోని కీలక, సున్నితమైన పరికరాలు సజావుగా పనిచేస్తున్నాయా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఎట్టకేలకు లభించిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్ కదలాడుతున్నట్లు భారత అంతిరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. దానితో సంబంధాలను పునరుద్ధరించుకునే పనిలో పడ్డారు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీని చంద్రయాన్-2 ఆర్బిటర్ గుర్తించిందని తెలిపారు. అందులో అమర్చిన థర్మల్ కెమెరా కొన్ని ఫొటోలు తీసిందని అన్నారు. వాటి ద్వారానే తాము దాన్ని గుర్తించినట్లు చెప్పారు.
ల్యాండర్ పనితీరు ఎలా ఉందనే విషయంపై సైతం తాము ఇప్పుడే ఎలాంటి ప్రకటనా చేయలేమని అన్నారు. హైరిజల్యూషన్ థర్మల్ కెమెరా ఫొటోలు తీయడం వల్ల ల్యాండర్ పనితీరు సజావుగానే సాగుతోందని అంచనా వేస్తున్నట్లు శివన్ స్పష్టం చేశారు. సాధారణంగా హార్డ్ ల్యాండింగ్ చోటు చేసుకున్న తరువాత కొన్ని సున్నిత పరికరాలు దెబ్బతినే అవకాశాలు అధికంగా ఉంటాయని అన్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద హార్డ్ గా ల్యాండ్ అయ్యుండవచ్చని చెప్పారు. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ వెలువడిందా? లేదా? అనేది కూడా తేలాల్సి ఉందని అన్నారు. దీనిపై మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి తమ శాస్త్రవేత్తల బృందం కృషి చేస్తోందని చెప్పారు.
