చెన్నై: తమిళనాడులోని కళ్లిదైకురుచి ఆలయంలోని నటరాజ కంచు విగ్రహం దోపిడీకి గురై దేశం దాటి పోయింది. మనదేశం దోచుకుపోయిన చాలా విగ్రహాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో ఉన్నాయని, వాటిని తిరిగి తెచ్చుకుంటున్నామని ఇందుకు సంబంధించిన ప్రత్యేక అధికారి మనికవేల్ చెప్పారు. నేను పదవిలో ఉండగానే మరికొన్నింటిని తిరిగి తెస్తామని అన్నారు. నటరాజ విగ్రహాన్ని ఢిల్లీ నుండి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక అధికారుల బృందం తీసుకువచ్చింది. విగ్రహం వెంట శివచరియాల బృందం, ఆలయ పూజారులు ఉన్నారు. పురుచ్చి తలైవార్ డాక్టర్ ఎంజిరామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రజలు వందల సంఖ్యలో చేరారు. స్టేషన్‌లో బందోబస్తు సందర్భంగా పోలీసులు బృందాలు మోహరించి ఉన్నాయి. స్టేషన్‌లో విగ్రహానికి రెండు గంటల పాలు పూజాదికాలు నిర్వహించారు. ఆ తరువాత విగ్రహాన్ని కుంభకోణం రోడ్డు నుండి ఆలయానికి చేర్చారు. తమిళనాడులోని పురాతన దేవాలయం నుండి ఈ విగ్రహాన్ని దొంగిలించారని 1980లో ఒక నివేదిక ద్వారా వెల్లడయింది. దొంగిలించిన నటరాజ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు తరలించారని తెలిసింది. ఈ క్రమంలో జరిగిన విచారణలో విగ్రహం అక్కడి మ్యూజియంలో ఉన్నట్లు కనుగొన్నారు. విగ్రహాన్ని ఆస్ట్రేలియా అధికారులు ప్రత్యేకాధికారి మనికవెల్ బృందానికి అప్పగించారు. విగ్రహాన్ని న్యూఢిల్లీ నుండి తీసుకువచ్చిన అధికారులు తమిళనాడులో దాన్ని యధాస్థానానికి చేర్చారు.
