ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉన్న కొలనుభారతి క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో సర్వశ్రేయో నిధుల(సీజీఎఫ్) కింద ప్రభుత్వం ఈ క్షేత్ర అభివృద్ధికి రూ.కోటి నిధులను కేటాయించింది. ఈ నిధులతో రాతికట్టడంతో కూడిన గర్భాలయం, ఆలయ ముఖమంటపం వంటి నిర్మాణాలు చేపట్టాలి. అయితే నిధుల కొరత కారణంగా ఆలయ జీర్ణోద్ధరణ పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదిన గర్భాలయ గోపుర నిర్మాణం పూర్తికానప్పటికీ 10వ తేదిన జరిగే వసంతపంచమి వేడుకలను పురస్కరించుకుని గర్భాలయాన్ని పూర్తిచేసి అమ్మవారికి నిత్యపూజలను ప్రారంభినప్పటికీ జీర్ణోద్ధరణ పనులు పూర్తికాలేదు. ప్రస్తుత గర్భాలయ గోపురం లేకపోవడంతో వర్షపునీరు ఆలయంలోకి కారుతోంది. అమ్మవారి మూలవిరాట్ విగ్రహం కూడా వర్షపునీటితో తడుస్తున్నా దేవదాయశాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. కాగా ఈ ఏడాది మార్చిలో శ్రీశైలంలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ తరపున పట్టువస్ర్తాలను సమర్పించేందుకు ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీశైలానికి విచ్చేశారు. ఆ సమయంలో దేవాదాయశాఖ కమిషనర్ పద్మ, శ్రీశైలం ట్రస్టుబోర్డు చైర్మన్ వంగాల శివరామిరెడ్డి కొలనుభారతి క్షేత్ర విశిష్టతను వివరించి క్షేత్రాభివృద్ధికి సహకరించాలని విన్నవించారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులతో పాటు భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు రూ.50 లక్షల నిధులను టీటీడీ ద్వారా మంజూరు చేయాలని కోరారు. స్పందించిన ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్ రూ.25లక్షల టీటీడీ నిధులను కేటాయించేందుకు అంగీకరించారు. ఈ నిఽధుల కోసం దేవాదాయశాఖ తరపున టీటీడీకి కోరుతూ.. ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. దేవదాయశాఖ కమిషనర్ పద్మ ఆదేశాలతో జిల్లా అధికారులు నిధుల కోసం టీటీడీకి ప్రతిపాదనలు పంపించారే తప్ప నిధులను రాబట్టేందుకు చొరవ తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రతిపాదనలకే పరిమితమైన రూ.25లక్షల నిధులు
టీటీడీ రూ.25లక్షలు ఇస్తే పెండింగ్‌లో వున్న ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కలుషితమైన చారుఘోషిణీ నదిని బాగుచేయవచ్చు. సప్తశివాలయాలను భక్తులు దర్శించుకునేందుకు క్యూలైన్లను ఏర్పాటు చేయవచ్చు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ద్వారా నిధులు వచ్చేలా జిల్లా ప్రజాప్రతినిధులు, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు కొలనుభారతి క్షేత్రాభివృద్ధికి టీటీడీ నిధులను మంజూరు చేయించాల్సిన అవసరం వుంది.
సదుపాయాలు కల్పించకపోతే భక్తులకు ఇక్కట్లే
రాష్ట్రవిభజన నేపథ్యంలో కొలనుభారతి క్షేత్రానికి భక్తుల తాకిడి అధికమైంది. పర్వదినాల్లో రద్దీ మరింత పెరుగుతోంది. అయితే క్షేత్రంలోసరైన సదుపాయాలు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేకించి కొలనుభారతి క్షేత్రానికి రెగ్యూలర్ దేవాదాయశాఖాధికారి నిర్మించాల్సి వుంది. దీంతో ఆలయ పర్యవేక్షణతో పాటు అర్జితసేవలు, భక్తుల సదుపాయాలు మెరుగుపడే అవకాశం వుంటుంది. కొలనుభారతి క్షేత్రాన్ని చేరుకునేందుకు అటవీ ప్రాంతంలోని 3కిమీల మేర రహదారిని నిర్మించాల్సిన అవసరం వుంది. క్షేత్ర పరిధిలో వాహనాలను నిలుపుకొనేందుకు పార్కింగ్ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. సప్త శివాలయాల ఎదుట ముఖమంటపాన్ని నిర్మించాలి. క్షేత్రంలోని పవిత్రమైన చారుఘోషిణీ తీర్థ ప్రవాహామార్గంలోని పూడికను తొలగించి నీటి ప్రవాహం జరిగేలా చర్యలు తీసుకోవాలి. పుణ్యస్నానాలు ఆచరించేందుకుగాను క్షేత్రంలో వున్న చిన్నపాటి కొనేరును మరింత విస్తీర్ణం, లోతును పెంచి పరిశుభ్రమైన నీరు నిల్వ వుండేలా చర్యలు చేపట్టాలి. స్నానమాచరించేందుకు ప్రత్యేక స్నానఘట్టాలను ఏర్పాటు చేయడంతో పాటు షవర్‌బాత్ కుళాయిలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో డార్మినేటరీలు, హోటళ్లను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి పర్చాలి. భక్తులకు దాహార్థి తీర్చేందుకు శుద్ధజలాలను అందుబాటులో వుంచాలి. అదేవిధంగా మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించాలి. క్షేత్రంలో కొనసాగుతున్న అర్జిత సేవలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం వుంది. క్షేత్రపరిధిలోని నల్లమల అరణ్యంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాచీన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయాలి.
ప్రతిపాదనలు పంపించాము
కొలనుభారతి క్షేత్రాభివృద్ధికై టీటీడీ నుంచి రూ.25లక్షల నిధులను మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించాము. నిధులు మంజూరు కాగానే క్షేత్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాము.
