న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లను, బస్సు డిపోలు, విమానాశ్రయాలు, మాల్స్‌లలో త్వరలో మట్టికప్పుల్లో టీ లభ్యం కానుంది. ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. కాగా ఇప్పటికే వారణాసి, రాయ్‌బరేలీ రైల్వే స్టేషన్లలో మట్టికప్పుల్లో టీని విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ తాను పీయూష్ గోయల్‌కు లేఖ రాస్తూ, కనీసం వంద స్టేషన్లలో మట్టికప్పుల్లో టీ విక్రయాలు జరిగేలా చూడాలని కోరానని అన్నారు. ఇదేవిధంగా బస్సు డిపోలు, విమానాశ్రయాల్లో మట్టికప్పుల్లో టీ విక్రయాలు జరిగేలా ఆదేశాలు జారీచేశామన్నారు. మాల్స్‌లలో సైతం మట్టికప్పుల్లో టీ విక్రయాలను ప్రోత్సహిస్తామన్నారు. కాగితం, ప్లాస్టిక్‌లతో రూపొందించే టీ కప్పుల వలన పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా టీ కప్పుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వలన స్థానికంగా ఉండే కుమ్మరులకు సైతం ఉపాధి పెరుగుతుందని అన్నారు.
