ముంబై : అమెరికా కేంద్రంగా నడుస్తున్న నెట్ ఫ్లిక్స్ పై శివసేన ఐటీ సెల్ సభ్యుడు రమేష్ సోలంకీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన నెట్ ఫ్లిక్స్ హిందువుల మనోభావాలను కించపరుస్తూ వీడియోలు పెడుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ముంబైలోని ఎల్టీ మార్గ్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. సేక్రెడ్ గేమ్స్, లైలా, ఘౌల్, కమేడియన్ హసన్ మిన్ హాజ్ పేరిట నెట్ ఫ్లిక్స్ హిందువులను అంతర్జాతీయంగా కించపరుస్తుందని రమేష్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వీడియోలు పెడుతున్న నెట్ ఫ్లిక్స్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రమేష్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో కోరారు. హిందువులను కించపరుస్తున్న నెట్ ఫ్లిక్స్ లైసెన్సును రద్దు చేయాలని రమేష్ డిమాండు చేశారు. ఈ ఫిర్యాదు కాపీని రమేష్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్, ముంబై పోలీసు కమిషనర్లకు పంపించారు.
