పూరీ : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి భూ కక్ష్యలో పరిభ్రమించిన విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా మంగళవారం నాడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. భారతకాలమాన ప్రకారం ఉదయం 9 గంటల 2 నిమిషాలకు చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్‌ను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంలో ఇదే అత్యంత క్లిష్టమైన దశగా అభివర్ణించింది.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 2 ప్రయోగ దశలో మంగళవారం నాడు అత్యంత కీలక ఘట్టం సక్సెస్ అయింది. జులై 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్3ఎం1 ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. సరిగ్గా నెల రోజుల తర్వాత భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.
చంద్రయాన్ – 2 కు సంబంధించి అత్యంత కీలక ఘట్టం విజయవంతం కావడంతో దేశమంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఒడిషాలోని పూరీ తీరంలో సైకత శిల్పం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇసుక తిన్నెలపై జాబిల్లి వాలిందా అన్నట్లుగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. చంద్రుడి వైపు ఎక్కుపెట్టినట్లుగా చంద్రయాన్ – 2 ఉపగ్రహం ఔరా అనిపిస్తోంది. “చంద్రయాన్ 2, ఇండియాస్ మిషన్ టు మూన్, జయహో అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో తన అభినందనలు తెలియజేశారు పట్నాయక్.
