లక్షలాది భక్తులు ఒకే చోట గుడికూడే ప్రదేశం. ఏ ఒక్క సందర్భంలోనో కాదు.. ఏడాది పొడవునా ఇంతే. రాష్ట్ర వ్యాప్తంగా ఆ మాటకొస్తే.. దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు చేరుకునే ఏకైక పుణ్యక్షేత్రం తిరుమల. బ్రహ్మోత్సవాలు, పండుగలు, సెలవుల వంటి ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీ చెప్పనలవి కాదు. ఇంతమంది భక్తులు ఒకేసారి, ఒకే చోట చేరుకునే ప్రదేశం ఎలా ఉంటుంది? దీనికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తిరుమల మాత్రం దీనికి భిన్నం. కలియుగ వైకుంఠంలో వెలిసిన శ్రీనివాసుడి దివ్యసముఖాన్ని దర్శించడానికి వచ్చే ఏ ఒక్క భక్తుడు కూడా అసంతృప్తికి గురి కాకుండా ఏర్పాట్లు చేస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం.

ఇన్ని లక్షల మంది భక్తులు చేరుకునే చోట వారందరికీ సంతృప్తికరమైన సౌకర్యాలను కల్పించడం ఎలా సాధ్యం? ఈ విషయంపై అధ్యయనం చేయడానికి 12 మంది శిక్షణలో ఉన్న ఐఎఎస్ అధికారులు తిరుమలకు చేరుకున్నారు. సాధారణ రోజుల్లో కంటే బ్రహ్మోత్సవ సమయంలో తిరుమలకు చేరుకునే లక్షలాది మంది భక్తులను టీటీడీ అధికారులు ఎలా నియంత్రిస్తారు? వారికి అవసరమైన సౌకర్యాలను ఎలా కల్పిస్తారు? నివాస వసతి, మంచినీటి సౌకర్యం, శ్రీవారి దర్శనం ఏర్పాట్లు, అన్న ప్రసాద వితరణ కార్యకలాపాలను ఎలా నిర్వహిస్తారనే అంశంపై అధ్యయనం చేయడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారులు తిరుమలకు వచ్చారు.
ఈ 12 మంది ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం వారు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు క్రౌడ్ మేనేజ్ మెంట్ పై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమల క్యూ కాంప్లెక్సులు, అలిపిరి, శ్రీనివాస మంగాపురం వైపు నుంచి మెట్ల మార్గం గుండా కాలి నడకన వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు, వసతి గృహాలు..అన్నిటికంటే మించి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రద్దీ నిర్వహణ వంటి అంశాలపై వారికి వివరించారు.
దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు ఒక ఎత్తు కాగా.. వారి మనోభావాలను గౌరవించడం మరో ఎత్తు అవుతుందని టీటీడీ అధికారులు ప్రొబేషనరీ ఐఎఎస్ లకు సూచించారు. ఏ ఒక్కరి మనోభావాన్ని కించపర్చకుండా వారికి సౌకర్యాలను కల్పించడం కత్తి మీద సాము వంటి అంశమని వివరించారు. ఈ సందర్భంగా ఐఎఎస్ అధికారులు మాట్లాడుతూ.. తాము ఇప్పటిదాకా కొన్ని ధార్మిక సంస్థలను పరిశీలించామని.. టీటీడీ తరహా నిర్వహణ ఎక్కడా లేదని అన్నారు. వేలాది మందికి ఉచిత భోజనాన్ని కల్పించడం, నివాస వసతి వంటి అంశాల్లో లోటు లేకుండా చూడటం అసాధారణమని చెప్పారు.
