ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీర ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే అధికార పార్టీలో భిన్న వాదనలు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన పార్టీ నేతల నుండి ఒత్తిడి మొదలవుతోంది. తాజాగా మంత్రి బొత్సా రాజధాని అమరావతి పైన చేసిన వ్యాఖ్యల కలకలం ఇప్పుడు సొంత పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. రాజధాని తరలిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో.. వైసీపీ కర్నూలు జిల్లా నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ జిల్లాకు తొలి నుండి అన్యాయం జరుగుతోందని..తమ జిల్లాను రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని వైసీపీ నేతలంతా ముఖ్యమంత్రితో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అమరావతి రాజధానిగా ఉన్న రెండు జిల్లాల నేతల్లో తాజా పరిణామాలు రుచించటం లేదు. దీంతో..ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీనిని ఏ రకంగా పరిష్కరిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.వైసీపీలో పంచాయితీ…
వైసీపీలో కొత్త పంచాయితీ…
తాజాగా మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాదు..అధికార వైసీపీలోనూ కలకలానికి కారణమయ్యాయి. బొత్సా వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అమరావతి నుండి మారుస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో అధికార పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతలు తమ స్వరం పెంచారు. జిల్లాలో తాజా ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం రెండు లోక్ సభ స్థానాలతో పాటుగా 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది . దీంతో..ఇప్పుడు ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎంపీలు..ఎమ్మెల్యేలు తాజాగా తమ డిమాండ్ ను ప్రభుత్వం ముందుంచారు. అమరావతి నుండి రాజధాని తరలిస్తే తొలి నుండి అన్యాయానికి గురవుతున్న కర్నూలు జిల్లాను రాజధాని చేయాలనేది వారి డిమాండ్ . దీని కోసం జిల్లాలోని నేతలంతా త్వరలోనే సమావేశమై..ముఖ్యమంత్రిని కలుస్తామని జిల్లాకు చెందిన వైసీపీ నుండి పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేసారు. దీనికి కొనసాగింపుగా ఎస్వీ మోహన రెడ్డి సైతం మరో ప్రకటన చేసారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ నూతన రాజధానిగా కర్నూలును ప్రకటించాలని ఇందుకోసం నేతలు రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ఇప్పుడు ఈ ప్రకటన ఆ జిల్లా ప్రజల మీద ప్రభావం చూపిస్తే.. రాజకీయంగా ఎటువంటి పరిణామాలకు కారణమవుతుందనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తోంది.
