పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే జమ్మూ పౌరులపై కాల్పులు జరిపిందని భారత సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
పాకిస్తాన్ సైన్యం కాల్పుల వల్ల జమ్ములోని గుణదిష్ట్, తంగ్దర్ గ్రామాల్లో ఒక పౌరుడు చనిపోయాడని మరో ముగ్గురు గాయపడ్డారని చెప్పింది.
“పాక్ దళాల కాల్పుల్లో 55 ఏళ్ల మొహమ్మద్ సాదిక్ చనిపోయారు. ఈ కాల్పుల్లో 70 ఏళ్ల మొహమ్మద్ మక్బూల్, 50 ఏళ్ల మొహమ్మద్ షఫీ, 22 ఏళ్ల యూసఫ్ హామిద్ గాయపడ్డారు. తీవ్రవాదులను భారత్‌లోకి పంపేందుకే పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది” అని ఇండియన్ ఆర్మీ తమ ప్రకటనలో చెప్పింది.
అటు భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆరోపించారు. దీనిపై ట్వీట్ చేసిన ఆయన “ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా జురా, షాకోట్, నౌషోరీ సెక్టార్లలో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది” అని ఆరోపించారు.
“మేం దానికి తగిన సమాధానం ఇచ్చాం. భారత సైన్యంలో 9 మంది జవాన్లు మృతిచెందారు. చాలా మంది గాయపడ్డారు. రెండు భారత బంకర్లు ధ్వంసం చేశాం. ఆ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో ఒక పాకిస్తాన్ జవాన్, ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు, ఐదుగురు పౌరులు గాయపడ్డారు” అని తెలిపారు.
