గాంధీజీ ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల ప్రభావానికి గురయ్యారు. జాన్ రస్కిన్ (1819-1900), హెన్రీ డేవిడ్ థొరో (1817-1862), లియో టాల్‌స్టాయ్ (1828-1910). ఒక బ్రిటిషర్; ఒక అమెరికన్; ఒక రష్యన్.
గాంధీజీ ప్రభావానికి గురైనవారూ ఉన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా (1928-2013), అమెరికాలో పౌర హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (1929-1968) తదితరులు. అయితే, వీరందరిలోనూ అహింస అనిగానీ, సహాయ నిరాకరణ అనిగానీ పలకగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు మాత్రం.. గాంధీ. అహింస అనేది గాంధీ ఇంటి పేరుగా మారిపోయింది, ఎందుకు?
1919లో గాంధీజీ ఇచ్చిన హర్తాళ్ పిలుపు మొదలుకొని 1942లో ఆయన నడిపిన ‘క్విట్ ఇండియా’ వరకూ అన్ని ఉద్యమాలూ శాంతియుతంగానే ప్రారంభమయ్యాయి. కానీ, వాటిలో ఏదీ అహింసాత్మకంగా ముగియలేదు. అయినా అహింసతోనే స్వాతంత్ర్యం సిద్ధించింది అని మనకు మనం నచ్చచెప్పుకొంటాం. అదే వింత.
ఉద్యమంలో హింస చేరిందని చెప్పి ప్రతిసారీ పొంగిన ఉద్యమంపై నీళ్లు కుమ్మరించారు గాంధీజీ, ఆయన నడిపిన ఉద్యమాలన్నిటికీ ఇదొక రొటీన్ ముగింపు. ఆయన ఉద్యమాన్ని నిర్దయగా బలిపెట్టినా.. శాంతి అహింసలను కాపాడడం కోసమే ఆయన ఆ పని చేశారని జాతి నమ్మింది. అలా నమ్మించారు. ఎవరు? శాంతి, అశాంతి, హింస, అహింస అనే మాయా వలయంలో నుంచి బయటపడి ఆలోచిస్తేగానీ అసలు మర్మం తెలియదు.