బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై రైతులు, గృహ కొనుగోలుదార్లు, ఇతరత్రా రుణాలు తీసుకునేవారికి రుణ అవకాశాలు కల్పించాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), చిన్న రుణ గ్రహీతలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సమావేశాలు ఏర్పాటు చేయనున్నాయి. 400జిల్లాలో 2 దశల్లో రుణ మేళాలు జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు.
200జిల్లాల్లో మొదటి దశగా అక్టోబరు 3నుంచి 7వరకూ, రెండో దశగా అక్టోబరు 11 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. పండగ సీజన్లో ఎక్కువ మందికి రుణాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన చేశామని పేర్కొన్నారు. ఈ క్రమంలో వ్యవసాయ, ఎంఎస్ఎమ్ఈ, గృహ, రిటైల్ రంగాలకు రుణాలు ఇస్తారని పేర్కొన్నారు.
ఉపశమనం:
ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈ రుణాలను 2020 మార్చి వరకు నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దంటూ బ్యాంకులకు ప్రభుత్వం సూచనలిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమైన మంత్రి నిర్మాలా సీతారామన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘ఒత్తిడికి గురైన ఎంఎస్ఎంఈల రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దంటూ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యూలర్ జారీ చేసింది. ఒకవేళ 2020 మార్చి వరకు ఎంఎస్ఎంఈ రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించకపోతే ఈ రంగానికి ఎంతో మేలు చేసినట్లే’ ఆర్థిక మంత్రి సూచించారు.
