హిందీని జాతీయ భాషగా గుర్తించాలన్న వివాదంపై పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి స్పందించారు. భారత ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి దక్షిణాది ప్రజలు హిందీ భాషను అనర్గళంగా నేర్చుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య భావోద్వేగమైన సంబంధాలను నెలకొల్పడానికి భాష ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అవసరమైతే ఓ అనువాదకుడ్ని ఏర్పాటు చేసుకోవాలని, తాను ఇదే పని చేస్తున్నానని తెలిపారు. హిందీ భాషను నేర్చుకుంటే తమ తమ సాంస్కృతిక విలువలు, లేదా వారసత్వం కనుమరుగై పోతుందన్న అపోహ నుంచి బయటపడాలని సూచించారు.
వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల మధ్య అవాంతరాలున్నాయని, అయితే అది ఆంగ్లంతో పూడ్చుకుంటున్నారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అంతరాలను తాను గమనించానని, ప్రతీ సారి హిందీయే అనుసంధానం చేయదని, కొన్నిసార్లు ఆంగ్లం కూడా ప్రజలను అనుసంధానం చేస్తుందని పేర్కొన్నారు. మరి హిందీ పరిస్థితి ఏం కావాలి? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, హిందీతో ప్రజలు అనుసంధానం కావాలని, అయితే దక్షిణాది ప్రజలు కేవలం అనువాదాలను విని మాత్రమే ఊరుకుంటున్నారని కిరణ్ బేడీ పేర్కొన్నారు.
