అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వికలాంగులు, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంది ప్రభుత్వం. వైఎస్ఆర్ పెళ్లి కానుక పేరుతో.. లబ్దిదారులకు చెల్లించే ఆర్థిక ప్రోత్సాహాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సీలకు ఇప్పటిదాకా ప్రభుత్వం 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోండగా..ఈ మొత్తాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష రూపాయలకు పెంచింది. కులాంతర వివాహాన్ని చేసుకున్న ఎస్సీలకు చెల్లించే మొత్తాన్ని 75 వేల నుంచి 1,20,000 రూపాయలకు పెంచింది. ఎస్టీలకు చెల్లించే 50 వేల రూపాయలను లక్ష రూపాయలకు, కులాంతర వివాహాన్ని చేసుకునే ఎస్టీలకు 1,20,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. అంతకుముందు ఈ మొత్తం 75 వేల రూపాయలే.
వెనుక బడిన వర్గాల కుటుంబాలకు పెళ్లి కానుకగా ప్రభుత్వం అందజేసే మొత్తం ఇప్పటిదాకా 30 వేల రూపాయలు. దీన్ని 50 వేల రూపాయలకు పెంచారు. బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే.. 74 వేల రూపాయలను చెల్లిస్తుంది ప్రభుత్వం. పెళ్లికానుక కింద మైనారిటీ కుటుంబాలకు చెల్లించే 50 వేల నగదు మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచారు.
అలాగే వికలాంగుల వివాహానికి ఇప్పటి దాకా లక్ష రూపాయలను ఇస్తుండగా..ఈ మొత్తాన్ని లక్షన్నరకు పెంచుతున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే- భవనాలు, ఇతర నిర్మాణ రంగానికి చెందిన అసంఘిటిత కార్మికులకు ఇప్పటిదాకా ఇస్తూ వచ్చిన 20 వేల రూపాయల నగదును లక్ష రూపాయలకు పెంచారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ పెంపుదల వర్తిస్తుంది.
