భారత ప్రభుత్వం ఆగస్టు 4న జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, అక్కడ కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి కొన్ని వేల మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
వేల సంఖ్యలో సైనికులను ప్రభుత్వం మోహరించింది. మొబైల్ ఫోన్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. రోడ్లు, వీధుల్లో పెద్దగా జనసంచారం లేదు.
స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా నడుస్తాయని ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాటి కార్యకలాపాలు సాగట్లేదు.
ప్రభుత్వంపై నిరసనతో కొందరు, మిలిటెంట్ల దాడుల భయంతో ఇంకొందరు వ్యాపారాలు మూసేశారు. జనజీవనం స్తంభించిపోయింది.
ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నవారిలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యమకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉన్నారు.
శ్రీనగర్ హైకోర్టులోని పెద్ద హాలులో ఓ సోఫాపై కూర్చున్న అల్తాఫ్ హుస్సేన్ ఆందోళనగా కనిపిస్తున్నారు.
ప్రజారవాణా సదుపాయాలు లేకపోవడంతో తన సొంత పట్టణం బారాముల్లా (50 కి.మీ.ల దూరం) నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఆయనకు బాగానే ఖర్చైంది.
అల్తాఫ్ సోదరుడు షబ్బీర్ ఓ గ్రామస్థాయి నాయకుడు. వివాదాస్పద ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టైనవారిలో షబ్బీర్ ఒకరు.
ఈ చట్టం కింద ప్రభుత్వం వ్యక్తులను రెండేళ్ల వరకూ నిర్బంధంలో ఉంచుకోవచ్చు.
షబ్బీర్ తరఫున వాదించేందుకు ఓ న్యాయవాదిని వెతుక్కునేందుకు అల్తాఫ్ శ్రీనగర్‌కు వచ్చారు.
