జమ్మూ కాశ్మీర్ లో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై వెలిసిన ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిన తరువాత.. పలుమార్లు ఆ దేశ సైనికులు కాల్పులకు పాల్పడ్డారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైన్యం మోర్టార్ షెల్స్ తో కాల్పులు జరిపింది. తాజాగా- చోటు చేసుకున్న ఈ పరిణామాలతో సరిహద్దు గ్రామాల్లో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేలకుండా భారత భూభాగంపైకి వచ్చి పడిన మూడు మోర్టార్ షెల్స్ ను సరిహద్దు భద్రత జవాన్లు పేల్చి వేశారు.
సరిహద్దుల్లోని పూంఛ్ సెక్టార్ పరిధిలో గల కర్మరా గ్రామ శివార్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత.. తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది పాకిస్తాన్ సైన్యం. పూంఛ్ సెక్టార్ పరిధిలోని కర్మరా గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సైనిక బలగాలు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కాల్పులు నిర్వహించారు. వారు సంధించిన మోర్టార్లు పేలలేదు. గ్రామ శివార్లలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన మూడు మోర్టార్ షెల్స్ ఉన్నట్లు గ్రామస్తులు బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇచ్చారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న జవాన్లు.. ఆ మూడింటిని పేల్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం మీడియాకు విడుదల చేశారు. మూడు మోర్టార్ షెల్స్ ను పేల్చిసిన దృశ్యాలు ఇందులో రికార్డయ్యాయి. ఒక్కో షెల్ వైశాల్యం 120 మిల్లీ మీటర్లు. ఈ షెల్స్ మందుపాతరలను పోలి ఉంటాయని, ఏదైనా ఇంటి మీద పడితే.. విధ్వంసాన్ని సృష్టిస్తుందని బీఎస్ఎఫ్ జవాన్లు వెల్లడించారు. అదృష్టవశావత్తూ అవి లక్ష్యాలను ఛేదించలేకపోయాయని అన్నారు.
పాకిస్తాన్ ఆక్రమిత్ కాశ్మీర్ లోని మూడు ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిన ఘటనలో కనీసం ఆరు మంది తీవ్రవాదులు మరణించి ఉండొచ్చని సైన్యాధికారి మేజర్ జనరల్ బిపిన్ రావత్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కనీసం నలుగురు పాకిస్తాన్ జవాన్లు మరణించి ఉంటారని వార్తలు వెలువడ్డాయి. దీన్ని పాకిస్తాన్ సైన్యాధికారులు ధృవీకరించలేదు. సరికదా- తాము చేపట్టిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది భారత జవాన్లు మరణించారంటూ ప్రకటనలను ఇచ్చుకుంది. తాజాగా చోటు చేసుకున్న వరుస సంఘటనలతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే వస్తోంది.