గుంటూరు (సంగడిగుంట) : పెరిగిన బంగారం ధరలు వినియోగదారులను కొనుగోలుకు దూరం చేస్తుంటే వ్యాపారాలు మందగించాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. శ్రావణ మాసంలో ఏటా వివాహ ముహూర్తాలు, మంచిదని కొందరు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో గుంటూరులో కార్పొరేట్ షాపులు, రిటైల్ మార్కెట్‌లలో కలిపి సుమారుగా రోజుకు నాలుగు కిలోల బంగారం అమ్మకం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం రెండు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా నెలకున్న వాణిజ్య యుద్ధంలో భాగంగా మదుపర్లు బంగారం వైపు చూడడంతో పసిడి రోజుకోరకంగా రేట్లు పెంచుకుంటుంది.
శుక్రవారం గుంటూరు మార్కెట్‌లో గ్రాము బంగారం రూ.3,650, వెండి రూ.48 గాను ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రాము నాలుగువేల దాటింది. డాలర్ మారకం విలువ మరికొన్ని పరిస్థితులు కలిపి గుంటూరు మార్కెట్‌లో ఈ రేట్లు ఉన్నాయి. అయితే రేట్లు పెరగడం ప్రారంభమైన నెల రోజుల నుంచి అమ్మకాలు మాత్రం 75 శాతం నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బంగారం పెరగడంతో కొనలేక కొందరు దూరమయ్యారని తెలిపారు. కొనగలిగిన శక్తి ఉన్న వారు తగ్గుతుందన్న ఆశతో కొనుగోళ్ళను నిలిపివేశారు. దీంతో వ్యాపారాలు మందగించి పోయాయని, వస్తువులకు కూడా డిమాండ్ తగ్గిందని తెలిపారు. వెండి మార్కెట్ కూడా గ్రాముకు 80 పెరగడంతో అదే పరిస్థితి నెలకుని ఉందని తెలిపారు.
తాకట్టు వ్యాపారులు ఖుషీ బంగారం రేటు ఊహించని విధంగా పెరగడంతో బంగారం వ్యాపారులు దిగాలుగా ఉంటే తాకట్టు వ్యాపారులు మాత్రం ఆనందంగా ఉన్నారు. వారి వద్ద తనఖా పెట్టిన వస్తువులు రేట్లు పెరగడంతో విడిపించుకు వెళతారని కొందరు.. ఇప్పటికే వదిలివేసుకున్న వస్తువులకు రేట్లు పెరగడం వల్ల తమకు వడ్డీతో సహ గిట్టుబాటు అవుతుందని మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రాముకు గుంటూరు మార్కెట్‌లో రూ.1,,800 అప్పు ఇవ్వగా ప్రస్తుతం రూ.2,500 వరకు ఇస్తున్నారు.
