వారణాసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గం. వర్షాల వల్ల ఈ నగరం ఏమీ ఇబ్బంది పడలేదు. కానీ వర్షపు నీటి వల్ల మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రస్తుతం ఈ నగరం పరిస్థితి ఎలా ఉందంటే…
నాలుగు రోజుల ఎడతెరిపి లేని వర్షాలకు వారణాసి నగరం తడిసి ముద్దైంది. నీళ్లు నిలవని ప్రదేశం నగరం మొత్తంలో ఎక్కడా లేదు.
వర్షం వచ్చింది, వెళ్లిపోయింది. కానీ నాలుగు రోజులైనా సరే వర్షపు నీరు మాత్రం వీధుల్లో నుంచి పోవట్లేదు.
పోలీసు శాఖ కార్యాలయం, పోలీస్ లైన్, పోలీసుల గృహ సముదాయాలు, పోలీస్ గ్రౌండ్, క్లబ్ హౌస్, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ వాననీటిలో మునిగిపోయాయి. దీంతో ఏ పనీ ముందుకు సాగడం లేదు.
మురుగునీటి పారుదల వ్యవస్థలో లోపాల కారణంగా నీరంతా ఇళ్లు, షాపుల్లోకి ప్రవేశించింది. కోనియా, సామ్నే ఘాట్, సరైయా, డోమ్రీ, నగవా, రమనా, బనపురవా, శూల్ టంకేశ్వర్, ఫుల్వరియా, సువర్ బడ్వా, నఖీఘాట్, సరాయా… ఇలా అన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో నగరం మొత్తం పరిస్థితి దారుణంగా మారింది.
నేత కార్మికుల నివసించే ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరి, మగ్గాలన్నీ నీటమునిగాయి. దీంతో దాదాపు 50వేల మంది ప్రజలకు జీవనోపాధి కరవైంది.
జిల్లాలోని రెండు రైల్వే మండలాల్లోని దాదాపు డజను కాలనీలు నీళ్లలోనే ఉన్నాయి. దీంతో రైల్వే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మార్గం లేకుండా పోయింది.
ఉత్తర రైల్వేకు చెందిన ఏఈఎన్ కాలనీ పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది.
మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఇక్కడ వర్షం నీటిని తొలగించే ప్రయత్నాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనరేటర్ల సాయంతో వాననీటిని తోడి పోస్తున్నారు.
“పీలీకోఠీ, మజూర్లూమ్, ఆజాద్ పార్క్, జియావుల్ ఉలూం ప్రాంతాలు ప్రతి సంవత్సరం చిన్నపాటి వర్షాలకే నీటమునిగేవి. భారీ వర్షాలు కురిస్తేనే ఇలా జరుగుతుందని అనుకోనవసరం లేదు. ఒక్క గంట వర్షం పడితే చాలు, నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల మురుగు, చెత్త అంతా ఎక్కడిక్కడే నిలిచిపోతోంది. దీంతో నీళ్లు కూడా ఆగిపోతున్నాయి” అని జిల్లాలోని బాకరాబాద్‌కు చెందిన నేత కార్మికులు మొహమ్మద్ అహ్మద్ అన్సారీ అన్నారు.
చౌక్ ఘాట్ నుంచి రాజ్ ఘాట్ వరకూ ఉన్న నేతకార్మికుల కాలనీ విస్తరించి ఉంది. 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాలనీలో దాదాపు 50 వేలమంది నివసిస్తున్నారు.
వర్షాకాలంలో ఇదంతా నీటితో నిండిపోతుంది. ఇక్కడ చాలావరకూ చేతిమగ్గాలే. మరమగ్గాలైనా, చేతిమగ్గాలైనా నేలపైనే కదా పనిచేసేది. ఇప్పుడు ఆ పనంతా ఆగిపోయింది.
ఇక్కడి డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. చిన్న వర్షం పడినా అవి పొంగుతాయి. ఇక్కడున్న వారంతా నేతపని చేసేవారే. వర్షం పడితే వాళ్లందరి ఇళ్లలోకీ నీళ్లు చేరుతున్నాయి. దీంతో పని ఆగిపోతోంది. జీవనోపాధి కోల్పోతున్నారు. వర్షం తగ్గినా సరే జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి నెలల సమయం పడుతుంది.
“ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ లంక నుంచి ఇక్కడికి (గొదౌలియాకి) వచ్చారు. మరోసారి లంక నుంచి మోదీ ఇక్కడకు రావాలని మేం కోరుకుంటున్నాం. వచ్చి ఈ నీటిలో నడవాలి. అప్పుడు ఆయనకు సమస్య తీవ్రత అర్థమవుతుంది. రోడ్ల సమస్య, నీళ్ల సమస్య, డ్రైనేజీ సమస్య… ఇలా అన్నీ తెలుస్తాయి” అని నగరంలో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఒకటైన గొదౌలియాకు చెందిన సంజయ్ సింగ్ అన్నారు.
అంతటితో సంజయ్ ఆగలేదు… “నరేంద్ర మోదీ ముందు మా ప్రాంత ఎంపీ. ఆ తర్వాతే ప్రధాన మంత్రి. ఓ ఎంపీగా ఆయన మా సమస్యలను అర్థం చేసుకోవాలి. వర్షం కురిసింది కేవలం రెండు రోజులే, కానీ మేం నష్టపోయే రోజులు అంత కన్నా ఎక్కువే. ఇది ఆయన అర్థం చేసుకోవాలి” అని అన్నారు.
“2009లో దీనికోసం (వారణాసిలో వరద నీటి పారుదలకు) ఓ ప్రణాళిక రూపొందించాం. రూ.253 కోట్ల వ్యయంతో జిల్లా వ్యాప్తంగా 76 కి.మీ. మేర పైపులైను వేశాం. 2014లో ఈ పని పూర్తైంది. మిగిలిన రోడ్డు పనులు కూడా 2015లో పూర్తయ్యాయి. వారణాసిలో మురుగు నీటి పారుదలకు సంబంధించి 2015 తర్వాత ఎలాంటి ప్రణాళికలు, పథకాలూ రూపొందించలేదు. 2015లో మేం పూర్తిచేసిన పథకాలే ఇప్పటికీ నగరంలో అమల్లో ఉన్నాయి” అని గంగా కాలుష్య నియంత్రణ సంస్థ వారణాసి విభాగం జనరల్ మేనేజర్ ఎస్కే రాయ్ తెలిపారు.
“వారణాసి నగర అభివృద్ధి ప్రణాళికను 2006లో రూపొందించాం. డ్రైనేజీలనీ, పైపులనీ తవ్వకాల పేరుతో రూ.305.15 కోట్లు వ్యయం చేశాం. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ పరిష్కారం మాత్రం లభించలేదు. డ్రైనేజీ పైపులైన్లు, మురుగు నీటి పైపులైన్లు, మంచినీటి పైపులైన్లు అంటూ ఓ ప్రణాళిక లేకుండా ఎన్నోసార్లు తవ్వుతున్నారు” అని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ శతరుద్ర ప్రకాశ్ అన్నారు.
“వారణాసిని బీజేపీ నేతలు ఓ ప్రయోగశాలలా మార్చేశారు. ఎప్పటినుంచో వాళ్లు చేయాలనుకున్న పనులకు ఈ ప్రాంతాన్ని ప్రయోగశాలగా ఉపయోగిస్తున్నారు. ఓసారి క్యోటోలా మారుస్తామంంటారు, మరోసారి స్మార్ట్ సిటీ అంటారు.. కానీ వాస్తవంలో కంటికి కనిపించే అభివృద్ధి ఏమీ జరగడం లేదు” అని ప్రధాని మోదీపై పోటీ చేసిన అభ్యర్థి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అజయ్ రాయ్ అన్నారు.
“గత 30 ఏళ్లలో చాలా సంవత్సరాల పాటు వారణాసి మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీనే అధికారంలో ఉంది. డ్రైనేజీలు, తాగునీరు, వీధి లైట్లు… నగరంలోని ఇలాంటి కనీస సౌకర్యాలలేమికి వారే బాధ్యులు. స్మార్ట్ సిటీ అన్నారు కానీ దాని ద్వారా ఏమీ జరగలేదు. కేవలం గోడలకు రంగులు వేశారు” అని సామాజిక కార్యకర్త సంజీవ్ కుమార్ సింగ్ అన్నారు.
“పనులన్నీ సరైన రీతిలో జరిగి ఉంటే ఈరోజు వర్షం నీరు ఇలా నిలిచి ఉండేది కాదు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభించేది” అని సంజీవ్ కుమార్ సింగ్ అభిప్రాయపడ్డారు.
