హిందూ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో చైనా త్రివిధ యుద్ధనౌక కలకలం రేపింది. ఈ నెల మొదట్లో భారత వైమానిక దళం నిఘా నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యుద్ధనౌక కనిపించింది. ల్యాండింగ్ ప్లాట్‌ఫాం డాక్ (ఎల్‌పీడీ)గా పిలిచే ఈ యుద్ధనౌకను నేవీ పి-8ఐ నిఘా విమానం గుర్తించినట్టు భారత వాయుసేన వర్గాలు వెల్లడించాయి. వాయుసేన వర్గాల కథనం ప్రకారం… ఆఫ్రికా లేదా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు చైనా నౌకలు తరచూ మలక్కా జలసంధి నుంచి ప్రారంభమయ్యే జలమార్గాన్ని ఉపయోగిస్తున్నాయి.
”ఎల్‌పీడీ నౌకపై ట్రక్కులు, ట్యాంక్‌లు, జీప్‌లను కూడా తరలించవచ్చు. ఒక్కోసారి ఇది పెద్దసంఖ్యలో హెలీకాప్టర్లను కూడా తరలించగలదు. యాంటీ-పైరసీ ఆపరేషన్స్ కోసం పనిచేసే నౌకలు కూడా ఈ మార్గం గుండా తరచూ వెళ్తుంటాయి. చైనా యుద్ధనౌకలు ఆఫ్రికా, గల్ఫ్ వెళ్లాలంటే ఈ ఒక్క మార్గమే అందుబాటులో ఉంది… అని ఓ సీనియర్ నేవీ అధికారి వెల్లడించారు. భారత నిఘా విమానం ద్వారా ఎల్‌పీడీ యుద్ధనౌక ఫోటోలు తీసినట్టు వైమానిక దళం వర్గాలు తెలిపాయి.
