న్యూఢిల్లీ: దేశంలో తొలి ప్రైవేట్ రైలు తేజస్ దేవీనవరాత్రుల శుభముహూర్తంలో ఢిల్లీ నుంచి లక్నో మధ్య ప్రయాణాన్ని ప్రారంభించనుంది. టిక్కెట్ బుకింగ్ మొదలుకొని ట్రైన్ నడపడం వరకూ అన్ని బాధ్యతలను ఐఆర్సీటీసీ పర్యవేక్షించనుంది. టిక్కెట్ల రేటు ఎంతన్నదని త్వరలోనే వెల్లడికానుంది. ఇది శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కన్నా 20 శాతం అధికంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ట్రైన్ మంగళవారం మినహా మిగిలిన అన్నిరోజులలో ప్రయాణించనుంది. ఉదయం లక్నోలో బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ చేరుకోనుంది. తరువాత ఢిల్లీలో 3 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6 గంటలకు లక్నో చేరుకోనుంది. మోదీ ప్రభుత్వపు 100 రోజుల అజెండాలో ప్రైవేటు రైలు అంశం కూడా ఉంది. ఈ రైలులో ప్రయాణించేవారు స్టేషన్లో ఏర్పాటు చేసిన లాంజ్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ట్రైన్‌కు సంబంధించిన డ్రైవర్, ఎలక్ట్రికల్ మొయింటనెన్స్ మొత్తం రైల్వేశాఖ చేతుల్లో ఉండనుంది. గార్డు, టీటీఈని ఐఆర్సీటీసీ పర్యవేక్షించనుంది. ఒక అధికారి తెలిపిన వివరాల ప్రకారం రైల్వేకి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు ఇందుకోసం పనిచేయనున్నారు. మరో ప్రైవేట్ తేజస్ రైలు అహ్మదాబాద్- ముంబైల మధ్య నడవనుంది.
