న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో చిదంబరం సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ క్రమంలో చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్ బానుమతి, ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం చిదంబరం ముందస్తు బెయిల్‌పై వాదనలు విననుంది. ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో బుధవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిదంబరం. అత్యవసరంగా వాదనలు వినాలని కోరినప్పటికీ.. సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించిన వాదనలకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆగస్టు 26 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి ఇస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ చిదంబరంను నాలుగు రోజులపాటు విచారించనుంది. సీబీఐ ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరినప్పటికీ న్యాయస్థానం మాత్రం నాలుగురోజులు మాత్రం అనుమతిచ్చింది.
ఐఎన్ఎక్స్ మనీలాండరింగ్ కేసులో 2007-08, 2008-09 మధ్య చిదంబరంకు చెల్లింపులు చేశారన్న ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయని కోర్టు తెలిపింది. ఆ మొత్తం చేతులు మారిన తీరును నిర్ధరించాల్సి ఉందని చెప్పింది. ఈ కేసులో నిందితుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అయితే, చిదంబరం దేశ పౌరుడిగా తన హక్కులను కాపాడుకునేందుకు ఆయన కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
కుటుంబసభ్యులు, న్యాయవాదులతో మాట్లాడేందుకు చిదంబరంకు ప్రతిరోజూ అరగంటపాటు సమయం ఇచ్చింది. రెండ్రోజులకొకసారి చిదంబరంకు వైద్యపరీక్షలు జరపాలని స్పష్టం చేసింది. అంతేగాక, చిదంబరం మర్యాదకు భంగం కలిగించరాదని కోర్టు పేర్కొంది.
