మన దేశం అంటే అక్కసును వెల్లగక్కుకుంటోన్న పాకిస్తాన్.. మరో దురాగతానికి ప్రయత్నించిన ఉదంతం ఇది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ వైపునకు వెళ్లోన్న స్పైస్ జెట్ విమానాన్ని అడ్డగించింది. దీనికోసం పాకిస్తాన్ ఏకంగా యుద్ధ విమానాలనే వినియోగించింది. ఎఫ్-16 రకానికి చెందిన యుద్ధ విమానాలతో కొన్ని నిమిషాల పాటు స్పైస్ జెట్ విమానాన్ని చుట్టు ముట్టిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) గురువారం వెల్లడించింది. ఈ ఘటన కిందటి నెల 23వ తేదీన చోటు చేసుకున్నదని డీజీసీఏ అధికారులు తెలిపారు.
కిందటి నెల 23వ తేదీన స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన ఎస్ జీ -21 రకం విమానం దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కాబూల్ కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 120 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ గగనతలం మీదుగా ఆఫ్ఘనిస్తాన్ కు చేరాల్సి ఉంది ఈ విమానం. పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన అనంతరం కొంతదూరం వెళ్లిన తరువాత ఆ దేశ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు స్పైస్ జెట్ విమానాన్ని చుట్టు ముట్టాయి. పైలెట్ తో గాల్లోనే రేడియో సంకేతాల ద్వారా సంభాషించాయి. వివరాలను వెల్లడించాలని ఆదేశించాయి.
అక్షాంశ, రేఖాంశాల నుంచి తప్పించాలంటూ ఒత్తిడి..
దీనితో పైలెట్.. పూర్తి వివరాలను వారికి వెల్లడించారు. ఇది స్పైస్ జెట్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అని, కాబూల్ కు ప్రయాణికులను తీసుకెళ్తున్నామని వివరించారు. 120 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని పైలెట్ వారికి తెలియజేశారు. అనంతరం విమానం అక్షాంశ, రేఖాంశాల నుంచి తప్పించాలని ఎఫ్-16 యుద్ధ విమానాల వింగ్ కమాండర్లు స్పైస్ జెట్ పైలెట్లను ఆదేశించారు. దీనికి ఆయన నిరాకరించారు. కమర్షియల్ విమానం అని, భారత వైమానిక దళంతో ఎలాంటి సంబంధమూ లేదని పదే పదే సూచించడంతో వదిలి వేసినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.
