భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రకు తెర తీసింది పాకిస్తాన్. విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా మన దేశ కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. భారత్ లో తిష్ట వేసినట్లుగా అనుమానిస్తోన్న ఉగ్రవాదులకు ఆ నకిలీ నోట్లను చేరవేస్తోంది. ఉగ్రవాదుల ద్వారా విస్తృతంగా వాటిని చలామణిలోకి తీసుకుని వస్తోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. పాకిస్తాన్ లో ముద్రించిన నకిలీ నోట్లను నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలోకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఇప్పటికే భారత్ లోని కొన్ని ప్రధాన నగరాల్లో నివాసం ఉంటున్నట్లుగా భావిస్తున్న లష్కరేతొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు చేరేలా నెట్ వర్క్ ను రూపొందించుకుందని, వారి ద్వారా నకిలీ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకొచ్చేలా కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మన దేశానికి చెందిన 2000, 500, 200 రూపాయల నోట్ల కట్లలు వెలగు చూశాయి. అవన్నీ నకిలీవే. వాటిని పాకిస్తాన్ లో ముద్రించి, బంగ్లాదేశ్ గుండా భారత్ లోని ప్రధాన నగరాలకు చేరవేయడానికి కుట్ర పన్నినట్లు తేలింది.
రెండు నెలల కిందట పాకిస్తాన్ జాతీయుడైన యూనుస్ అన్సారీ అనే వ్యక్తిని నేపాల్ పోలీసులు ఖాట్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 70 లక్షల రూపాయలకు పైగా మన దేశ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల కిందట అదే తరహాలో ఢాకాలోని హజ్రత్ షా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 లక్షల రూపాయల నకిలీ నోట్లను పట్టుకున్నారు. భారత్ లో నివసిస్తోన్న సల్మాన్ షేరా అనే వ్యక్తికి అందేలా పంపించిన ఓ పార్సెల్ లో నకిలీ నోట్లు కనిపించాయి.
బంగ్లాదేశ్ అధికారులు ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించారు. దీనిపై అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ అధికారులు మొత్తం కూపీ లాగారు. నకిలీ నోట్లు పెద్ద ఎత్తున చలమాణిలోకి తీసుకుని రావడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోన్న విషయాన్ని నిజమేనని నిర్ధారించారు. ఇదివరకు ఖాట్మండూ విమానాశ్రయంలో లభించిన 70 లక్షల రూపాయలు, తాజాగా ఢాకాలో ఓ పార్సిల్ ప్యాకెట్ లో దొరికిన కరెన్సీ నకిలీదని తేల్చారు. ఈ నకిలీ నోట్లన్నింటినీ లష్కరే తొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
