ఆరు ప్రపంచ చాంపియన్ టైటిల్స్, ఒక ఒలింపిక్ కాంస్యం, ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఒక్కో స్వర్ణం. ఇన్ని సాధించినా భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ మనసులో ఒక బాధ అలాగే ఉంది.
భారతదేశానికి ఒలింపిక్ స్వర్ణ పతకం గెలవలేకపోయాననేదే ఆమె బాధ.
రష్యాలో జరుగుతున్న మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం వెళ్లడానికి ముందు మేరీ కోమ్ బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
“నేను ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ టైటిల్స్ గెలిచాను. కానీ ఈ టోర్నమెంటుకు ఏ వాల్యూ లేనట్టు అనిపిస్తోంది. వార్తా పత్రికల్లో కూడా ఒక చిన్న కాలంలో ఈ వార్త ప్రచురిస్తున్నారు. నా లక్ష్యం ఒలింపిక్ స్వర్ణ పతకం గెలవడమే” అని మేరీ కోమ్ అన్నారు.
మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ 51 కిలోల విభాగంలో పోటీపడుతున్నారు.
ఇప్పుడు మేరీ కోమ్ దృష్టంతా వచ్చే ఏడాది టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్ తీసుకురావడంపైనే ఉంది.
“ఒలింపిక్ పోడియంలో అనుభవం విషయానికి వస్తే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో కాంపిటీషన్ స్థాయి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈసారీ, భారత్‌కు గోల్డ్ తీసుకురావడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తా” అని మేరీ కోమ్ చెప్పారు.
“ఇప్పుడు భారత్‌లో అందరికీ మహిళా బాక్సింగ్ గురించి తెలియడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి స్థాయిలో అమ్మాయిలు ఇందులోకి వస్తున్నారు. అది చాలా సంతోషించాల్సిన విషయం” అన్నారు.
