పుట్టినరోజు సందర్భంగా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 69వ పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్ లోని తన తల్లి హీరాబెన్ నివాసానికి మోడీ వెళ్లారు. ఈ సందర్భంగా తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆమెతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం మోడీ తల్లి హీరాబెన్ తో కలిసి భోజనం చేశారు.
పుట్టినరోజు సందర్భంగా మోడీ నేడు తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పలు ప్రాంతాలను సందర్శించారు. నర్మదా జిల్లా కేవడియాలోని బట్టర్ ఫ్లై గార్డెన్ ను సందర్శించారు. అనంతరం కాటన్ బ్యాగ్ లో ఉన్న సీతాకోకచిలుకలు గాల్లోకి ఎగురవేశారు. ఈ దృశ్యం కనువిందు చేసింది. తరువాత ప్రధాని కాక్టస్ గార్డెన్‌కు (ఎడారి మొక్కలు ఉన్న గార్డెన్) ను కూడా సందర్శించారు. ఖాల్వని ఎక్ టూరిజం స్థలాన్ని సందర్శించారు.
అనంతరం సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని సందర్శించారు. డ్యామ్‌పై పూజలు చేశారు.నర్మదా నదికి ప్రధాని హారతి ఇచ్చారు. నర్మదా పరివాహక ప్రాంతంలో ఏక్తా నర్సరీని సందర్శించి..అక్కడ తయారు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల పనితీరును పరిశీలించారు. వాటి తయారు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
