న్యూఢిల్లీ: పురాతన పవిత్ర గ్రంధం భగవద్గీత స్ఫూర్తితో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి అత్యంత విలువనిస్తుందని ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ కాలం నాటి అనేక చట్టాలను మోదీ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిందనీ… మహిళల భద్రత కోసం ట్రిపుల్ తలాక్ నిషేధిత చట్టం లాంటి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్నామని గుర్తుచేశారు. ”నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే 1400లకు పైగా పాత కాలంనాటి, బ్రిటీష్ కాలం చట్టాలను రద్దు చేసింది. ప్రజలను అసౌకర్యానికి గురిచేస్తూ, ఇబ్బంది పెడుతున్నట్టు గుర్తించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం…” అని ఆయన వివరించారు. మరో 225 పాత చట్టాలను రద్దు చేయనున్నట్టు రాష్ట్రాలకు తెలియజేశామన్నారు.
దేశంలోని పలు కోర్టుల్లో వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. వివాదాస్పద అంశాలపై మధ్యవర్తిత్వం, సయోధ్య సహా ఇతర వివాద పరిష్కార విధానాలను ప్రోత్సహించేందుకు భారత మధ్యవర్తిత్వ మండలి (ఏసీఐ)ని స్వంతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలన్న యోచనలో కేంద్రం ఉందన్నారు. కేంద్రం కొత్తగా తీసుకు వచ్చిన నిబంధలతో సంబంధం లేకుండా ఆదాయ పన్ను అధికారులు సాధారణ ప్రజలకు నేరుగా నోటీసులు పంపే అవకాశం లేదు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
